2, మార్చి 2008, ఆదివారం

ఇన్ స్క్రిప్ట్ రాచబాట ఉండగా, ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డెందుకు?


ఇన్ స్క్రిప్ట్…

ఇన్ స్క్రిప్ట్ ( ఇండియన్ స్క్రిప్ట్ ) కీబోర్డు లేఅవుట్ ను 1986 లో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్,( DOE ) భారత ప్రభుత్వము వారు కంప్యూటర్లలో బ్రాహ్మీ లిపి ఆధారిత లిపులను ( తెలుగు, తమిళము, కన్నడము, మళయాళము, ఒరియా, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, గురుముఖి (పంజాబీ), దేవనగరి (హిందీ, మరాఠీ, సంస్కృతం)), కలిగిన భారతీయ భాషలలో రాయడానికి ఒక స్టాండర్డ్ కీబోర్డు లేఅవుట్ గా నిర్ణయించారు. ( “రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఫర్ స్టాండర్డైజేషన్ ఆఫ్ కీబోర్డ్ లేఅవుట్ ఫర్ ఇండియన్ స్క్రిప్ట్ బేస్డ్ కంప్యూటర్స్”, ఎలెక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ అండ్ ప్లానింగ్ జర్నల్, వాల్యూమ్ 14, నెం. 1, అక్టోబర్ 1986 ). తరువాత 1988 లో దీనికి కొన్ని స్వల్ప మార్పులు చేసారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వారు “ఇండియన్ స్క్రిప్ట్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ (ISCII)” ను మరియు ఇన్ స్క్రిప్ట్ ను కంప్యూటర్లలో భారతీయ భాషలనుపయోగించడానికి జాతీయ స్టాండర్డ్ గా నిర్ణయించారు (IS13194:1991).

అంతకు ముందు టైపురైటర్ల కాలంలో భారతీయ భాషలన్నింటికి ఒక స్టాండర్డ్ కీబోర్డు లేఅవుట్ అనేది లేదు.. వివిధ టైపురైటర్ మెషిన్ తయారీదారులు వివిధ కీబోర్డు లేఅవుట్లను పాటించేవారు. తద్వారా టైపరైటర్ కీబోర్డు లేఅవుట్లు కూడా మారుతూ వచ్చాయి. ఒక అక్షరాన్ని టైపుచేయడానికి కావలసిన వివిధ అక్షర భాగాలు కీబోర్డుపైన ఎక్కడెక్కడున్నాయో గట్టిగా గుర్తుంచుకోవలసివచ్చేది. అక్షరాల కూర్పు అనేది అంత అందగా రాకపోవడం, టైపింగ్ కూడా కష్టసాద్యంగా ఉండటం మూలానా, టైపురైటర్ పైన భారతీయ భాషల టైపింగ్ తగిన ప్రాచుర్యాన్ని పొందలేక పోయింది.

టైపురైటర్ కీబోర్డు కాదు.

టైపురైటర్ కీబోర్డు లేఅవుట్లతో ఏమాత్రం సంబంధం లేకుండా, కంప్యూటర్లలో భారతీయ భాషలను రాయడానికి ప్రత్యేకంగా రూపొందించిన కీబోర్డు లేఅవుటు, ఇన్ స్క్రిప్ట్. మాట్లాడుతున్నట్లే రాసే భాషలు మనవి. మాటతో సరిజోడుగాసాగే అక్షరాలు మనవి. అందుకే మన ఆక్షరమాల అల్లికలో ఓ లాజిక్ ఉంది. ఇన్ స్క్రిప్ట్ ఆ లాజిక్ నే ఫాలో అయ్యింది. అచ్చులు, వాటి గుణింతాలను కీబోర్డులో ఎడమవైపున, హల్లులను కీబోర్డులో కుడివైపున, మధ్యవరుసలో మన మాటల వెల్లువలో అధికంగా విన్పించే అక్షరాలను అమర్చి, వాటి ఒత్తక్షరాలను వాటిపైనే, పైవరుసలోనే అమర్చి, రాసేటప్పుడు అధిక వేగాన్ని సాధించడానికి అనుగుణంగా ఈ ఇన్ స్క్రిప్ట్ ను రూపొందించారు. కుడివైపునగల హల్లులపై వచ్చే గుణింతాలు ఎడమవైపున ఉండడం, హల్లుల ద్విత్వ, సంయుక్తాక్షరాల్లో అంతర్లీణంగా వచ్చే పొల్లుకూడా ఎడమవైపున మధ్య వరుసలో ఉండడంద్వారా, రాసేటప్పుడు సవ్యసాచిలా రెండుచేతులనుపయోగించి అతి సులభంగా అధిక వేగాన్ని సాధించగలిగే అవకాశం ఈ ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ లోనే ఉన్నది. ఒకింత సాదన తర్వాత నిమిషానికి 40 నుండి 60 పదముల వేగంతో అతిసులువుగా రాయగలుగుతాము.

అందుకే బ్రహ్మీ లిపి ఆధారిత లిపులను కలిగిన భారతీయ భాషలలో, కంప్యూటర్లో రాయడాన్ని అతిసులభంగా నేర్చుకోవడానికి మరియు అధిక వేగంతో రాయడానికి అనుగుణమైన కీబోర్డులేఅవుట్ ఈ ఇన్ స్క్రిప్ట్ ఒక్కటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంగ్లీష్ ఫొనెటిక్ గతుకుల రోడ్డును వదలి.....

తెలుగు టైప్ రైటర్ కాలంనుండి వచ్చిన, “తెలుగు టైపింగ్ క్లిష్టమైనది” అనే భావన అలాగే కొనసాగడం, ఇన్ స్క్రిప్ట్ లోని సరళత గురించి తగినంత ప్రచారం జరగక పోవడం, కంప్యూటర్లో తెలుగు టైపింగ్ నేర్పే సాప్ట్వేర్ లు కూడా లేకపోవడం ద్వారా, చాలామంది ఇంటర్నెట్ పైన మొదట ఆంగ్ల అక్షరాలనుపయోగించి తెలుగును రాయడానికి అలవాటుపడ్డారు. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చినవారు, మరొకలేఅవుటును గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందా? అంటూ ఇంగ్లీష ఫొనేటిక్ నత్తనడకే బాగుందిలే అని సరిపుచ్చుకుంటున్నారు.


ఇన్ స్క్రిప్ట్ రాచబాటలో వెళ్దాం.

కాలం చెల్లిన తెలుగు టైప్ రైటర్లతోబాటే “తెలుగు టైపింగ్ క్లిష్టమైనది” అనే భావననూ వదిలించుకొని, ఇంపైన ఇన్ స్క్రిప్ట్ ను అలవర్చుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడే ఆంగ్లభాషలో ఎంత వేగంగా రాయగలమో అంతకన్నా వేగంగా తెలుగులో రాయగలుగుతాము. మన ఆలోచన వేగంతో రాయగలిగే అవకాశం ఉంటే అంతకన్నా కావల్సిందేముంది. మన ఆలోచనలకు అంతరాయం లేని వేగం ఇన్ స్క్రిప్ట్ తోనే సాధ్యం. ఇంత చక్కని ఇన్ స్క్రిప్ట్ ఉండగా, ఇంకా తెలుగుకు ఆంగ్లఅక్షరాల సంకెళ్లు ఎందుకు? తెలుగును తెలుగులో రాసే పద్ధతికి దూరమవ్వాల్సిన కర్మ మనకెందుకు.

సాదనమున పనులు సమకూరు ధరలోన అన్నారు వేమన. కొద్దిపాటి సాదనతో ఇన్ స్క్రిప్ట్ లో తెలుగును మంచి వేగంతో రాయగలుగుతాము. ఆమాటకొస్తే, సాదన లేకుండానే ఆంగ్లంలో టైపింగ్ చేయగలమా ? తెలుగును తెలుగులో రాయడానికి, తెలుగు లిపికి కొత్త ప్రాణం పోయడానికి ఇన్ స్క్రిప్టే సరైన దారి. ఇన్ స్క్రిప్టుకు స్వాగతం పలుకుదాం, ఇంగ్లీష్ ఫొనెటిక్ కు స్వస్థి చెప్పుదాం.

ఇన్ స్క్రిప్టే ముద్దు, తెలుగుకు ఆంగ్లలిపి సంకెళ్లిక వద్దు.
తెలుగును తెలుగులోనే రాద్దాము.

8 కామెంట్‌లు:

గిరి Giri చెప్పారు...

నాకు ఇన్ స్ర్కిప్టు అలవాటయ్యాక ఇక తెలుగు కోసం ఆంగ్లంలో టైపుచేయడం మానుకున్నాను..

rākeśvara చెప్పారు...

లెస్స పలికితిరి అనుపమ గారు.
తొలి టపా తోనే ఎంతో సమాచారం ఇచ్చారు. ప్రతిసూచనలతోఁ సహా.
నేను కూడా దేశలిపి బొత్తాలపట్టి మీద ఒక వ్యాసం వ్రాసాను అప్పట్లో ..
మీదాంట్లో ఇంకా వివరాలు వున్నాయి.
ఈ సమాచారాన్ని వికీలాంటి చోట్ల కూడా చేర్చవచ్చు..


నేను ఇప్పుడు మా మిత్రుడు ఇంటికి వచ్చాను. వాడు బీహారి. అక్కడ మీ టపా చదివి, వెంటనే తెలుగు కీబోర్డు ఎంచుకుని, తిన్నగా తెలుగులోఁ వ్రాయడం మొదలుపెట్టాను!

బ్లాగులోకానికి స్వాగతం.

rākeśvara చెప్పారు...

తొలిటపాల్లోనే , అని చదువుకోండి.

Naga చెప్పారు...

సహాయం కావలెను: "ఇన్‌స్క్రిప్టులో టైపుట ఎలా?" అనే పాఠం కోసం చూస్తున్నాను.

శాంతి చెప్పారు...

ఇన్ స్క్రిప్టు లో వ్రాయాలి అంటే ఏదేని సాఫ్ట్వేర్ ను ఇన్స్టాల్ చేసుకోవాలా? ఇన్ స్క్రిప్టు లే అవుట్ వున్న కీ బోర్డు (ఉదాహరణ కోసమైనా సరే) ఎక్కడ దొరుకుతుంది?

శాంతి చెప్పారు...

చూడబోతే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు మరొక పోస్టు లో ఇచ్చినట్టు గా వున్నారు. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎక్కడ లభిస్తుంది?

అనుపమ చెప్పారు...

శాంతిగారు, ఇన్ స్క్రిప్టులో రాయడానికి ఏ సాప్ట్వేర్ అవసరంలేదు, మీ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం Windows XP లేదా Vista అయితే. www.anupamatyping.com వెబ్ సైట్ పైన గల సూచనలను పాటించి మీ కంప్యూటర్లో తెలుగు సపోర్టింగ్ ఫైల్లు ఇన్ స్టాల్ చేసుకొండి. ఇది చాలు మీరు మీ కంప్యూటర్లో ఏ పనైనా తెలుగులో చేయడానికి. ఇకపోతే ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో తెలుగులో రాయడాన్ని నేర్పడానికి వచ్చిన సాప్ట్వేర్ అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్. 24 గంటల్లో ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్లో తెలుగు టైపింగ్ నేర్పుతుంది. ఈ సాప్ట్వేర్ కోసం హైదరబాదులో ఈ ఫోన్ నంబర్లను సంప్రదించండి. 040-32533445, 040-30421507, 09704872664

అనుపమ చెప్పారు...

గిరి గారు, రాకేశ్వర రావు గారు, ఇన్ స్క్రిప్ట్ లో తెలుగు టైపింగ్ వచ్చినవారందరూ దానిలోని సరళత గురించి,వేగం గురించి నలుగురికీ చెప్పడం ప్రారంభిస్తే, తెలుగుకు ఆంగ్లలిపి సంకెళ్లను తొందరలోనే తొలగించగలుగుతామేమో.

నాగరాజా గారు, త్వరలోనే ఈ విషయంపైన ఒక టపా రాసే ప్రయత్నం చేస్తాను.

శాంతిగారు, ఇన్ స్క్రిప్టు లే అవుట్ వున్న కీ బోర్డు ఫోటో ఉదాహరణ కోసం www.anupamatyping.com వారి వెబ్ సైట్ పైన కలదు.