21, ఫిబ్రవరి 2008, గురువారం

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ ఎందుకు?

కంప్యూటర్లలో తెలుగును ఉపయోగించడానికి ఆకృతి, అను ఫాంట్స్, శ్రీలిపి. ఐలీప్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు విడుదల చేసిన ఫ్రీ తెలుగు సాప్ట్ వేర్ లాంటి ఎన్నో సాప్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లలో తెలుగును టైపు చేయడానికి 1. ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్, 2. టైపురైటర్ కీబోర్డు లేఅవుట్, 3. ఫొనెటిక్ కీబోర్డు లేఅవుట్ అని వేరు వేరు కీబోర్డు లేఅవుట్ లు కలవు.

కంప్యూటర్లలో తెలుగును టైపుచేయడానికి గల పై మూడు కీబోర్డు లేఅవుట్ లలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, భారత ప్రభుత్వము వారు రూపొందించిన ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ మెరుగయినదని చెప్పవచ్చును. ఈ ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ భారతీయ భాషలకోసం ప్రత్యేకంగా రూపొందించ బడినది కావడంద్వారా, దీనినుపయోగించి అతి తక్కువ కీప్రెస్సులతోనే భారతీయ భాషలలో కంప్యూటర్లో రాయగలుగుతాము. అంతే కాక ఏదైనా ఒక భారతీయ భాషలో టైపింగ్ నేర్చుకుంటే మిగతా అన్ని భ్రాహ్మీ లిపి ఆధారిత లిపిని కలిగిన భారతీయ భాషలలో కూడా టైపింగ్ చేయగలుగుతాము.

ఆంగ్ల భాషతో పోలిస్తే తెలుగు భాషలో అక్షరాల సంఖ్య ఎక్కువగా ఉండడం, మరియు తెలుగు భాషలో ద్విత్వక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉండడం ద్వార, తెలుగు టైపింగ్ క్లిష్టమైనదనే భావన కలిగి, డి.టి.పి. ఆపరేటర్ వృత్తిని ఎన్నుకున్నవారు తప్ప ఇతరులెవరూ తెలుగు టైపింగ్ నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదనే మాట సత్యదూరం కాదు.

ఈ ఇంటర్నెట్ యుగంలో, ఇన్ స్టాంట్ మెస్సేజింగ్ లు, ఆన్ లైన్ చాటింగ్ లు, ఈ మెయిల్లు, స్వంత వెబ్ పేజ్ లు, బ్లాగులు మన దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిన ఈ రోజూల్లో, మన భావాలను మన మాతృభాషలో వ్యక్తంచేయడానికి ఉపయోగపడే ఉపకరణాలుంటే బాగుంటుంది.

తెలుగు టైపింగ్ రాకపోవడం ద్వార, తెలుగు టైపింగ్ నేర్పే సాప్ట్వేర్ లు కూడా లేకపోవడం ద్వారా, చాలామంది ఇంటర్నెట్ పైన మొదట ఆంగ్ల అక్షరాలనుపయోగించి తెలుగును రాయడానికి అలవాటుపడ్డారు. పద్మ, బర్ హ, లేఖిని లాంటి ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ ( ఆంగ్లంలో రాస్తే తెలుగులో అచ్చయ్యే పరికరాలు ) వచ్చాక వీటి నుపయోగించి తెలుగులో రాయడానికి అలవాటుపడ్డారు.

తెలుగును ఆంగ్ల భాషలో రాయడంలోనూ, ఫొనెటిక్ కీబోర్డు లేఅవుట్ ను ఉపయోగించడంలోనూ, ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ నుపయోగించి రాయడంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తెలుగును ఆంగ్ల అక్షరాలతో రాస్తున్నామనే భావన మొదటి ఇబ్బంది అయితే, ఎక్కువ కీ ప్రెస్సులు అవసరం కావడం మరో ఇబ్బంది. తెలుగును ఆంగ్ల భాషలో రాసేపద్ధతికి, ఫొనెటిక్ కీబోర్డు లేఅవుట్ కు, ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ కు అలవాటు పడి, తెలుగును తెలుగులో రాసే పద్ధతికి దూరమవుతున్నామా అనే బాధ మరొకటి. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఇన్ స్క్రిప్ట్ కీబోర్డు లేఅవుట్ లో తెలుగు టైపింగ్ నేర్చుకోవడమే సరైన దారేమో.

కంప్యూటర్లలో తెలుగును ఉపయోగించడానికి పైన చెప్పినట్టు, ఆకృతి, అను ఫాంట్స్, శ్రీలిపి. ఐలీప్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు విడుదల చేసిన ఫ్రీ తెలుగు సాప్ట్ వేర్ లాంటి ఎన్నో సాప్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నా, వీటిని ఉపయోగించాలంటే ముందుగా తెలుగు టైపింగ్ వచ్చి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు విడుదల చేసిన ఫ్రీ తెలుగు సాప్ట్ వేర్ సీడీ లోని జిస్ట్ ఒపెన్ టైప్ టైపింగ్ టూల్ తో సహా, ఈ సాప్ట్వేర్లేవీ తెలుగు టైపింగ్ ను నేర్పవు. రాయడం ఎలాగో నేర్పకుండానే నోట్ బుక్కులనిచ్చాము కదా ఇక రాయండి అంటే ఎలా. కాలం చెల్లిపోయిన టైపురైటర్లపైన తెలుగు టైపింగ్ నేర్చుకొనే ఓపిక తెలుగు డి.టి.పి. ని వృత్తిగా ఎన్నుకోవాలనుకునే వారికి తప్ప, ఇతరులెవరికీ లేదు కదా.

ఈ పరిస్థితుల్లో కంప్యూటర్లలోనే తెలుగు టైపింగ్ ను సులువుగా నేర్పే సాప్ట్ వేర్ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దీని ద్వార తెలుగు డి.టి.పి. ని వృత్తిగా ఎన్నుకోవాలనుకునే వారు మాత్రమే కాకుండా, ఏ వృత్తిలో ఉన్నవారైనా కంప్యూటర్లో తెలుగులో ఏ పనైనా చేయడానికి వీలు కలుగచేసినట్లవుతుంది. ఉదాహరణకు, కంప్యూటర్లో తెలుగు టైపింగ్ చేయడం వస్తే, ప్రభుత్వ అధికారులు అధికార భాషగా తెలుగును అమలు చేయవచ్చును. అధికారులకు తెలుగు టైపింగ్ రాకపోవడం ద్వారా, తెలుగు అధికారభాషగా విస్తృతమైన అమలుకు నోచుకోలేక పోయింది. విలేకరులు తమ వార్తలను క్షణాల్లో చేరవేయవచ్చును. రచయితలు తమ రచనలకు కొత్తమెరుగులు దిద్దుకోవచ్చును. ఇంటర్నెట్లో తెలుగులోనే మెస్సేజింగ్, చాటింగ్ చేయవచ్చును. తెలుగులో ఈ-మెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుకోవచ్చును. తెలుగు వెబ్ సైట్లు రూపొందించవచ్చును, తెలుగులో సులువుగా బ్లాగ్ లు రాయవచ్చును. ఒకటేంటి కంప్యూటర్లో ఏపనైనా తెలుగులోనే చేసుకోవచ్చును.

ఈ దిశగా వచ్చిన ఒక ఉపకరణం, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్. ఇది తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్. రెండు సంవత్సరాల కృషితో రూపొందించిన ఇంతటి అందమైన, ఉపయోగకరమైన టైపింగ్ ట్యూటర్ ఆంగ్ల భాషతో సహా మరే ఇతర భారతీయ భాషలకు కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో.

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్, ఇన్ స్క్రిప్ట్ కీబోర్డులేఅవుట్ లో, ఇరువదినాలుగు గంటల్లో, తెలుగు చదవడం వచ్చిన ప్రతి ఒక్కరికి, కంప్యూటర్లో తెలుగును తెలుగులో రాయడం నేర్పిస్తుంది. తెలుగు పదకవితాపితామహుడైన అన్నమయ్య సంకీర్తనల శ్రావ్యమైన నేపథ్య సంగీతాన్ని వినిపిస్తూ, తెలుగు సంస్కృతికి అద్దంపట్టే అనేక ఆటలద్వారా, తెలుగు టైపింగ్ ఒక చిన్నపిల్లల ఆట, అని నిరూపిస్తుంది.

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ లో తెలుగు టైపింగ్ నేర్పడంతోబాటు తెలుగు భాషపైన కూడా మంచి పట్టువచ్చేలా చేయడానికి కొన్ని వందల జాతీయాలను, నానుడులను, సామేతలను, తెలుగు పద్యాలను, సాదారణంగా తప్పులు దొర్లే పదాల (కామన్ ఎర్రర్ర్స్ ) ను టైపింగ్ సాదన పాఠాలుగా ఇవ్యడం జరిగింది. ఇవి తెలుగు టైపింగ్ నేర్చుకోవడంతోబాటు తెలుగు భాషపైనకూడా మంచి పట్టు సాదించడానికి ఉవయోగపడ్తాయి.

కామెంట్‌లు లేవు: