19, డిసెంబర్ 2009, శనివారం

నా తెలుగు పాట.


నే విన్న తొలి మాట తెలుగు మాట,
నే నన్న తొలి మాట తెలుగు మాట,
నా తెలుగు వేయి వెలుగుల మూట.

తేనెకన్నా తీయనైనది నా తెలుగు,
వెన్నకన్నా సరలమైనది నా తెలుగు,
అమృతంకన్నా అమరమైనది నా తెలుగు.

నా తెలుగు అక్షరాలు చదువుల తల్లి తొలి చేవ్రాలులు,
నా తెలుగు అక్షరాలు నిండు చందురుని నెచ్చెలులు,
నా తెలుగు అక్షరాలు వరూధిని సరితూగు సొగసుగత్తెలు.

నా తెలుగు అక్షరాలు తరతరాలుగా కూడబెట్టిన తీయని తేనె చుక్కలు,
నా తెలుగు అక్షరాలు జగన్నాథుని నోటనానిన నున్నని వెన్నపూసలు,
నా తెలుగు అక్షరాలు జగన్మోహిని చేతులనుండి జారిపడిన అమృత బిందువులు.

నేనుండగ నా తెలుగుకు ఆంగ్ల అక్షరాల అవసరమేలా ?
నేనుండగ నా తెలుగుకు కంప్యూటర్లో క్లిష్టత యేలా ?
నేనుండగ నా తెలుగుకు అంతర్జాలంలో అవధులేల ?
నేనుండగ, నేనుండగ, నేనుండగ, నా తెలుగుకు నేనుండగ.
-అనుపమ

అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్
ఇరువది నాలుగు గంటల్లో,
తెలుగు చదవడం వచ్చిన ప్రతిఒక్కరికి,
కంప్యూటర్లో తెలుగు రాయడం నేర్పుతుంది.



ఒక ఆవేదన, ఒక ఆలోచన, ఒక ఆవిష్కరణ.


ఒక ఆవేదన



లిపిలేని భాషలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయి, ఇతర భాషల్లో విలీనమైపోయి క్రమంగా కనుమరుగై పోతాయి అనేది అనుభవ సత్యం. రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష, చందమామలాంటి అందమైన అక్షరాల తెలుగు భాష, తేనె తీయదనాన్ని మరిపించే తెలుగు భాష, మన అమ్మ భాష, అలా కనుమరుగైపోవడం మనకిష్టమేనా?

నలబైఏల్ల అధికార భాష, అధికారుల ఆచరణలో నాలుగో శాతం కూడా లేని భాష, మన తేనెలొలుకు తెలుగు భాష. చట్ట సభల్లో అడంబరం కోసం ఆంగ్లంలో మాట్లాడే శాసన సభ్యుల గొప్పతనంతో చిన్నవోయిన భాష మన తెలుగు భాష. టైపు మిషిన్ లలో తలకట్టులొకపక్క, ఒత్తులొక పక్క ఒరిగి పోయి అందం పాడయిపోయినా అసువులు నిలిస్తే అదే పదివేలు అనుకున్న భాష. కంప్యూటర్ కాలంలో కొత్త మెరుపులు దిద్తుకోవచ్చుననుకుంటే, ఆంగ్ల అక్షరాలతో తెలుగును రాసే పద్ధతికి అలవాటుపడి, ఉన్న లిపిని పోగొట్టుకుంటున్నామా.

కంప్యూటర్లలో తెలుగు ప్రథమశ్రేణి భాషగా వెలుగొందాలంటే రోమన్ లిపినే తెలుగు భాషకు అనుగుణమైన సంకేతాలు చేర్చుకుని వాడుకుంటే ప్రపంచం సాధిస్తున్న వేగాన్ని మనం అందుకోగలం, అనే భావనలు బాధాకరం కాదా. ట్రాన్స్ లిటరేషన్ టూల్స్ కు అలవాటు పడి, తెలుగును తెలుగులో రాసే పద్ధతికి దూరమవుతున్నామా. తెలుగును ఆంగ్ల అక్షరాలతో రాసే పద్ధతికి, ట్రాన్స్ లిటరేషన్ స్కీమ్ లకు ప్రత్యామ్నయం లేదా.

ఒక ఆలోచన

ఇన్ స్ర్కిప్ట్ ఇంపుగా లేదా. సాదనమున పనులు సమకూరు ధరలోన అన్న వేమన్న సూక్తి గుర్తు లేదా. సాదన లేకుండానే ఆంగ్లంలో టైపింగ్ చేయగలమా. సాదనతో తెలుగు టైపింగ్ రాదా. కంప్యూటర్లలో తెలుగును ఆంగ్ల అక్షరాలతో రాసే పద్ధతికి స్వస్థిచెప్పడానికి, ఇన్ స్ర్కిప్ట్ లేఅవుట్ లో తెలుగు టైపింగ్ నేర్చుకుంటే సరిపోదా. తెలుగును తెలుగులో రాయడానికి, తెలుగు లిపికి కొత్త ప్రాణం పోయడానికి ఇది ఒక సరైన దారికాదా.

సరే, కానీ అందరూ ఏకలవ్యులు కాలేరు కదా. గురువు లేక విద్య వచ్చునా. ఇన్ స్ర్కిప్ట్ లేఅవుట్ లో తెలుగు టైపింగును నేర్పేదెవ్వరు. ఎపుడో అపుడు ఎవరో ఒకరు రాకపోతారా, తెలుగు టైపింగ్ నేర్పడానికి, తన ఆలోచనలకు ప్రాణం, రూపం తానై నిలిచే తల్లి భాషకు తన ఋణం తీర్చుకోవడానికి.

ఒక ఆవిష్కరణ

ఆ అవేదన ఆలోచనగా మారగా, ఆ ఆలోచనలనుండి పుట్టుకొచ్చిన ఒక కొత్త ఉపకరణం, “అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్”.

ఇన్ స్ర్కిప్ట్ లేఅవుట్ లో, ఇరువదినాలుగు గంటల్లో, తెలుగు చదవడం వచ్చిన ప్రతి ఒక్కరికి, కంప్యూటర్లో తెలుగును తెలుగులో రాయడం నేర్పిస్తుంది. తెలుగు పదకవితాపితామహుడైన అన్నమయ్య సంకీర్తనల శ్రావ్యమైన నేపథ్య సంగీతాన్ని వినిపిస్తూ, తెలుగు సంస్కృతికి అద్దంపట్టే అనేక ఆటలద్వారా, తెలుగు టైపింగ్ ఒక చిన్నపిల్లల ఆట, అని నిరూపిస్తుంది, అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్. ఇది ఒక శుభోదయం.


ఈ వ్యాసము ఇంతకు ముందు www.anupamat.blogspot.com లో 21-10-2007 ప్రచురించబడినది.